Thursday, March 6, 2008

చంద్రబింబాననా

నాకు చాలా ఇష్టమైన పద్యం ,మా నాన్నగారు చాలా తరచుగా చదువుకునే పద్యాలలో ఒక పద్యం "చంద్రబింబాననా".మరీ ముఖ్యం గా అన్ని రోజులూ ఆది వారాలే అయిన వేసవి సెలవులలో ,ఆరుబయట వెన్నెలలో ,వాలు కుర్చీలో పడుకుని శ్రావ్యంగా మా నాన్నగారు పద్యాలు పాడటం తలచుకున్నప్పుడల్లా చాల ఆనందం గా ఉంటుంది. శ్రీనాధుడు వ్రాసిన పద్యం.బహుశా కాశీ ఖండం నుంచి కావచ్చు. పద్య కవిత్వం,ప్రాచీన సాహిత్యం గురించి నాది కేవలం "శ్రుత పాండిత్యం" మాత్రమే.

చంద్ర బింబాననా చంద్ర రేఖా మౌళి నీల కుంతల భార నీల గళుడు
ధవళాయతేక్షణా ధవళాఖిలాంగుండు మదన సంజీవనీ మదన హరుడు
నాగేంద్ర నిభయాన నాగకుండల ధారి భువన మోహన గాత్ర భువన కర్త
గిరిరాజ పుత్రికా గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వ గురుడు

గౌరి శ్రీ విశ్వ నాధుండు కనక పాదుకలు
మెట్టి చట్టలు పట్టుకొనుచు యేగు
దెంచిరి వయ్యార మెసగ మెసగ
విహరణక్రీడ మా యున్న వేదికపుడు

పాదభంగం,యతిభంగం కాకుండా రాసానని నమ్మకం తక్కువ.జ్ఞాపకం లోంచి రాసిన పద్యం.

ఈ పద్యం లో సొగసైన నడక,శబ్దసౌందర్యమే కాదు,ప్రతి పాదంలో మొదటి భాగం పార్వతీ దేవి వర్ణన కి సంబంధించినది,రెండవ భాగం పరమ శివుని వర్ణన కి సంబంధించినది.ఎత్తుగడ ఒకరకంగానే మొదలైనా,ఒకే అర్ధాన్నిచ్చే పదాలతో మొదలుబెట్టి వేరు వేరు వర్ణనలు చేయటం అర్ధనారీశ్వరులైన పార్వతీ పరమేశ్వరుల వర్ణనకి ఎంతో అందమైన,అర్ధవంతమైన,సముచితమైన ఔచితి ని సూచిస్తుంది. (శరీరాన్నే చెరిసగం పంచుకున్న పార్వతీ పరమేశ్వరులు పద్యపాదాలను మాత్రం చెరిసగం పంచుకోరా!!!)

ఈ పద్యం కి అర్ధం (నాకు చేతనైనట్లు)

చంద్ర బింబము వంటి ముఖము కలిగినది(పార్వతి),చంద్రవంకని శిరస్సున ధరించినవాడు(శివుడు)
వత్తైన నల్లని(నీలమైన)శిరోజాలు కలిగినది,నీలమైన(నల్లని) కంఠం కలవాడు
తెల్లని కన్నులు కలది, తెల్లని శరీరము కలవాడు ,
మన్మధుడిని బ్రతికించినది,మన్మధుడిని దహించినవాడు,
ఏనుగు (నాగేంద్రము)నడక వంటి అందమైన నడక కలిగినది, నాగకుండలాలను ఆభరణాలుగా ధరించిన వాడు
భువనమోహనమైన గాత్రము కలది,సర్వభువనాలకి కర్తయైన వాడు,
పర్వతరాజు ముద్దుల కూతురు,పర్వతములపైన నివసించేవాడు
అటువంటి గౌరీ దేవి శ్రీవిశ్వనాధులు చేయి చేయి కలిపి వయ్యరంగా వేంచేశారు.


ఎంత చక్కటి శిల్పం!పార్వతీ పరమేశ్వరులు "వయ్యార మెసగ మెసగ" వచ్చారని చెప్పటం ఎంత సముచితమైన వర్ణన !!సమస్త లోకాలకే కాదు నాట్యానికి,నృత్యానికి ఆదిదంపతులైన ఆ జంట నడకే వయ్యారాలొలికించే నాట్య విన్యాసమని చెప్పకనే చెప్పటం కాదా? మరి నటరాజు,ఆయన అర్ధాంగి గౌరిదేవి ప్రతి కదలికా నాట్యం కాక మరేమవుతుంది?! అసలు వారి కదలికలోనే Cosmic Rhythm ఉంది !!!

ఒక గొప్ప తన్మయత తో నిండిన భక్తిభావాన్ని సౌందర్య రసస్ఫోరకం గా సూచించటం లోనే ఆయన శిల్ప వైశిష్ట్యం తెలుస్తుంది

నాకైతే ఈ పద్యం విన్నప్పుడల్లా,విలాసంగా నాట్యం చేస్తున్న పార్వతీపరమేశ్వరుల చిత్రం చూస్తున్నట్లుంటుంది.
ఎవరైనా చక్కటి నృత్యకారిణులు ఇటువంటి పద్యాన్ని అభినయిస్తే బావుండుననిపిస్తుంది.

అయితే రెండవ పాదం లో "మదన సంజీవని మదన హరుడు " అని ఉంది. శివుడు మన్మధుడిని దహించటం జరిగాకే పార్వతి దేవి బ్రతికించటం జరిగినా ,ముందుగా మదన సంజీవని అనడం లో రెండు విధాలుగా ఔచితి ఉంది. మొదటగా ప్రతి పద్యపాదం లో ప్రధమార్ధం పార్వతి దేవికి సంబంధించినది కాబట్టి ఈ పద్య పాదం లో కూడా ప్రధమార్ధం ఆమెకి సంబంధించిన వర్ణన చేయటం .

రెండవది Precedence of Life over Death. మరణం పై జీవితం తాలూకు ఆధిక్యతను సూచించటం.ముఖ్యంగా అమరులైన దేవతల విషయం లో ఇది చాలా సందర్భోచితం.(ఈ విషయం మా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సాహిత్య చర్చలో ఒక సారి మా నాన్నగారు చెప్పినట్లు గుర్తు. )


గొప్ప శిల్పం,భావనా సౌందర్యం, ధార, భక్తిభావం ,రసమయంగా కలిసిపోయిన చక్కటి పద్యం.

అన్నట్లు,మహాశివరాత్రి శుభాకాంక్షలు !!!!