Friday, October 24, 2008

జ్ఞాపకాల జావళీలు- దీపావళి

మా ఇంట్లో దీపావళి సంరంభం ఓ నెల్నాళ్ళు ముందు నుండే ప్రారంభం అయ్యేది. అసలు వేసవికాలం సెలవులలో ఖాళీ అయిపోయిన ధనాగారాన్ని (దాన్నే ముద్దుగా కిడ్డీబ్యాంక్ అనేవారు) మళ్ళీ నింపటానికి మా అన్నయ్యకు దొరికిన సాకు దీపావళి. రంగయ్య కొట్టులో అరటిపళ్ళు కొబ్బరికాయలు తెమ్మని అమ్మ ఇచ్చిన డబ్బులలో,హారతికర్పూరం తెమ్మని నాయనమ్మ ఇచ్చిన డబ్బులలో దర్జాగా వాటా తీసేసుకుని ఎవరైనా అడిగితే దీపావళి చందా అని ఠీవీగా చెప్పేవాడు.దీపావళి దగ్గరయ్యేకొద్దీ ఏ బాణాసంచా కొనాలి,మా కాలనీ దద్దరిల్లేట్లు ఢమఢమాలు ఎలా కాల్చాలి వగైరా గంభీరమైన విషయాలన్నీ తన మిత్రబృందం తో సమావేశమై చర్చలు జరిపేవాడు.కొన్నాళ్ళు మా ఇంటి వెనకాల "శివకాశి" లెవెల్లో ఓ చిన్న సైజు టపాకాయల కర్మాగారం (హాండిక్రాఫ్ట్స్ మరి) పెట్టాలన్న బ్రిలియంట్ ఐడియా వారికి రాకపోలేదు.కాకపోతే ఆ ఆలోచన మొగ్గ తొడిగే లోపే మా నాన్నగారు నిర్దాక్షిణ్యంగా తుంచేశారు. అది వేరే సంగతి. పండగకు రెండు మూడు రోజుల ముందు మా నాన్నగారు తను కొన్న బాణాసంచా మా ముగ్గురికీ పంచేవారు. చిచ్చుబుడ్లు,కాకరపువ్వొత్తులు,మతాబాలు,భూచక్రాలు,వెన్నముద్దలు,చాంతాళ్ళు,విష్ణుచక్రాలు,సీమటపాకాయలు,లక్ష్మీ ఔట్లు,రాకెట్లు ఇంకా రక రకాల ఢమరుకలు వగైరాలన్నీ మూడు చాటలలో సర్ది ఎండలో ఉంచేవాళ్ళం.మందులు ఎండినంతసేపూ మా వాటా లోంచి ఏమన్నా వస్తుమార్పిడి మా అన్నయ్య వాటా లోకి "ఎవరి" ప్రమేయం లేకుండా జరిగిందేమో నని మా సోదరీమణులం దీర్ఘంగా ఆలోచించటంతో నే సగం రోజు అయిపోయేది.అంతేకాకుండా మా చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి సైకిలు వెనకాలే వేళ్ళాడే తట్టలో కట్టలుగా కట్టిన తాటాకు టపాకాయలు అమ్ముతూ ఒకతను ప్రతి సంవత్సరం వచ్చేవాడు. ఎక్కడో మద్రాసులో తయారు చేసిన మందులు కొని మన ఊరి పక్కన తయారు చేసిన మందులు కొనకపోతే ఎలా అని చాలా ఫీలయ్యి మరీ కొనేవాళ్ళం. మిగతా మందులు కాల్చటానికి దీపావళి వరకూ ఆగేవారం కానీ తాటాకు టపాకాయలు,సీమటపాకాయలు మాత్రం రోజూ స్కూల్ నుంచి రాగానే స్కూల్ బ్యాగు విసిరేసి అదే వేగంతో పెరట్లోకి పరిగెట్టి తాటాకు టపాకాయ ను ఒక వైపు మడిచి చేతిలో పట్టుకుని మరో చేతిలో వెలిగించిన ఊదుకడ్డీ ధరించి ,టపాకాయ వత్తి వెలిగించి , వెలిగీ వెలగగానే దూరంగా పడేట్టు రివ్వున పైకి విసిరేవాళ్ళం. టపాకాయ నేలకు తాకకముందే గాలిలో పేలేటట్లు విసరటం మా గోల్. అలాగ ఎన్ని కాల్చినా (కారప్పూస తిన్నట్లు) విసుగు వచ్చేదికాదు. నిజంచెప్పాలంటే అప్పుడు మా రామదండు మొత్తం లో అలా టపాకాయల్ని చేతిలో కాల్చిన (అంటే ఓ పొడవాటి న్యూస్ పేపరు కి ఓ చివర టపాకాయ పెట్టి మరో చివర ఊదుకడ్డితో ఆమడ దూరం నుంచి వంగి నిప్పు అంటించడం కాదన్నమాట) అమ్మాయిని నాకు గుర్తున్నంతవరకూ నేనే. ఇలాగా ఎలాగో అతి భారంగా రోజులు గడిచాక మొత్తానికి నరకచతుర్దశి రోజు వచ్చేసేది. ఆ రోజు ఉదయాన్నే హడావుడిగా లేచేసి బాణాసంచా కాల్చేవాళ్ళం.నరకాసురుడిని సత్యభామ చంపిన రోజు కాబట్టి ఆ రోజు మన సంతోషానికి సూచనగా మందులు తప్పకుండ కాల్చాలని మా నాయనమ్మ గారి ఉవాచ.ఆవిడ రోజూ మధ్యాహ్నం పోతన భాగవతం కొంత చదువుకునేవారు. ఒక్కోసారి ఆవిడకు భాగవతం పూర్తి చేయటానికి నెలలు పట్టేది.ఆ తర్వాత భారతమో ,రామాయణమో మొదలు పెట్టేవారు. అలా రోజూ, మధ్యాహ్నం సాయంత్రపుటెండలో కరిగిపోయేవేళ,తన వ్యాసపీఠం ముందు కూర్చుని పుస్తకాన్ని కళ్ళకద్దుకుని ఆవిడ గొంతెత్తి చదువుకుంటూ ఉండేవారు.చుట్టూ ఆడుకుంటూ మేము,వంట చేస్తూ మా అమ్మగారు,మొక్కలకు నీళ్ళు పోస్తూ మా నాన్నగారు ఓ చెవి అసంకల్పితంగా అటు పడేసి ఉంచేవాళ్ళం. యుద్ధం చేస్తున్న సత్యభామని వర్ణిస్తూ పోతనగారు భాగవతం లో వ్రాసిన పద్యాలు ఆవిడ ఒక సందర్భం లో చదువుకోవటం నాకు ఇప్పటికీ గుర్తు .
దీపావళి రోజు సాయంత్రం మట్టి ప్రమిదెలలో నువ్వుల నూనే ,వత్తులు వేసి వెలిగించి మా అమ్మగారు ఇంటిచుట్టూతా,వరండా లో మెట్లమీద,కిటికీ అంచుల మీద,తులసిచెట్టు చుట్టూ దీపాల్ని అందంగా అమర్చే వారు. నా దీపావళి జ్ఞాపకాలలోకెల్లా అందమైన జ్ఞాపకం అది.చాలా సాదాసీదాగా ఇటుక రంగులో ఉండే ఆ జోడు ప్రమిదెలు ఎంత అందంగా ఉండేవో! ఇప్పుడు అందమైన కొవ్వొత్తుల తో ఎన్నో రంగులలో ,రకరాల ఆకారాల్లో ప్రమిదలు వస్తున్నా ఆ మట్టి ప్రమిదలలో ఉన్న సరళమైన,ప్రశాంతమైన అందం వాటి కి లేదేమో నని అనిపిస్తుంది. నిజానికి నా అసోసియేషన్స్ వాటితో ముడిపడటం బహూశా నాకు అవి అంతగా నచ్చటానికి ఒక కారణం కావచ్చు.
నా దీపావళి జ్ఞాపకాలలొ మరో అందమైన జ్ఞాపకం "పూలపొట్లాలు".ఒక సంవత్సరం ఎవరో మాకు పల్లెలలో తయారుచేసిన "పూలపొట్లం" తెచ్చారు.అది ఎలా చేస్తారో తెలీదు కానీ అది నిజంగా పూలపొట్లమే. అంత లలితంగా,సుకుమారంగా ,మెత్తని పూలరెక్కల్లా రాలే నిప్పురవ్వల్ని నేనెప్పుడూ చూడలేదు. మేము కొనుక్కున్న బాణాసంచా వదిలేసి ఆ పూలపొట్లాన్ని తిప్పటానికి పిల్లలందరం పోటీపడటం నాకు ఇంకా గుర్తే.అది మీద పడకుండా వర్తులాకారంలో చుట్టూ ఎలా తిప్పాలో తెచ్చినాయన చూపిస్తేకానీ తెలియలేదు.మొదట్లో కాస్త తడబడ్డా అలవాటైనాక పుప్పొడి రేణువులో,పూరేకులో ,నక్షత్రాలో అన్నట్లు రాలే నిప్పురవ్వల జ్యోతిర్వలయంలో నిలబడటం ఓ అపూర్వమైన అనుభవం.
దీపాలు పెట్టగానే మా చెల్లి కుదురుగా ఓ పక్కన తన వెన్న ముద్దలు,కాకరపువ్వోత్తులు ,చాంతాళ్ళు,మతాబాలు,పాముబిళ్ళలు కాలిస్తే మరో పక్క మా అన్నయ్య లక్ష్మి ఔట్లు,సీమటపాకాయలు,రాకెట్లు,ఢమఢమాలు కాల్చేవాడు. నా లాంటి బైపార్టిసన్లు కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ కాలక్షేపం చేసేవాళ్ళం.అన్నట్లు నాకు చాలా ఇష్టమైన వాటిల్లో విష్ణుచక్రాలు ,చిచ్చుబుడ్లు మొదటివి.ముఖ్యంగా విష్ణుచక్రాలు గిరగిరా తిరుగుతున్నపుడు చెయ్యి కాలకుండా ఉండటానికీ ,అవి కింద పడేయకుండా ఉండటానికీ చేసే భరత నాట్యవిన్యాసం ఇంకా గుర్తే.ఈ చిచ్చుబుడ్లు వెలిగించినప్పుడల్లా విరగ పూచిన నక్షత్రాల చెట్ట్లని కొన్ని క్షణాలపాటు ఇంటి ముంగిట్లో నాటినట్లు ఉండేది.అలా అలిసిపోయేంతవరకు దీపావళి మందులు కాల్చి ,మందులు అయిపోయాక మిగిలిన మందులు చెత్తకాగితాలు అన్నీ వేసి ఓ బోనఫైర్ వేసేవాళ్ళం. అది చల్లారాక నిద్రకళ్ళతో ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం.అయినా నాగులచవితి వరకూ అడపా దడపా టపాకాయల శబ్దాలు వినబడుతూనే ఉండేవి.

అన్నట్లు ,మా నాయనమ్మగారు శ్రావ్యం గా గొంతెత్తి చదివిన పోతన భాగవతం లోని నరకాసురుడితో సత్యభామ యుద్ధాన్ని వర్ణించే పద్యాలు కొన్ని ఇవిగో.

మ.పరుఁ జూచున్ వరుఁజూచు నొంప నలరింపన్ రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్ గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్ర సందోహమున్
సరసాలోకసమూహమున్ నెఱపుచుం జంద్రాస్య హేలాగతిన్

మ.అలినీలాలక చూడనొప్పెసఁగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో
నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీతస
ల్లలిత జ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో
వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై

సీ.వీణఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ బాణాసనంబెట్లు పట్టనేర్చె?
మ్రాఁకునఁ దీగెఁ గూర్పంగ నేరని లేమ గుణము నేక్రియ ధనుఃకోటిఁ గూర్చె?
సరవి ముత్యము గ్రువ్వఁ జాలని యబల యే నిపుణత సంధించె నిశిత శరముఁ?
జిలుకకుఁ బద్యంబు సెప్పనేరని తన్వి యస్త్రమంత్రము లెన్నడభ్యసించెఁ?

ఆ. బలుకు మనినఁ బెక్కు పలుకని ముగుద యే,
గతి నొనర్చె సింహ గర్జనలు?
ననఁగ మెఱసె ద్రిజగదభిరామ గుణధామ
చారు సత్యభామ సత్యభామ.

చదువరులకు దీపావళి శుభాకాంక్షలు !
వెన్నెల.

(న్యూజెర్సీ తెలుగు కళా సమితి వారి "తెలుగు జ్యోతి "సౌజన్యం తో )

Thursday, March 6, 2008

చంద్రబింబాననా

నాకు చాలా ఇష్టమైన పద్యం ,మా నాన్నగారు చాలా తరచుగా చదువుకునే పద్యాలలో ఒక పద్యం "చంద్రబింబాననా".మరీ ముఖ్యం గా అన్ని రోజులూ ఆది వారాలే అయిన వేసవి సెలవులలో ,ఆరుబయట వెన్నెలలో ,వాలు కుర్చీలో పడుకుని శ్రావ్యంగా మా నాన్నగారు పద్యాలు పాడటం తలచుకున్నప్పుడల్లా చాల ఆనందం గా ఉంటుంది. శ్రీనాధుడు వ్రాసిన పద్యం.బహుశా కాశీ ఖండం నుంచి కావచ్చు. పద్య కవిత్వం,ప్రాచీన సాహిత్యం గురించి నాది కేవలం "శ్రుత పాండిత్యం" మాత్రమే.

చంద్ర బింబాననా చంద్ర రేఖా మౌళి నీల కుంతల భార నీల గళుడు
ధవళాయతేక్షణా ధవళాఖిలాంగుండు మదన సంజీవనీ మదన హరుడు
నాగేంద్ర నిభయాన నాగకుండల ధారి భువన మోహన గాత్ర భువన కర్త
గిరిరాజ పుత్రికా గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వ గురుడు

గౌరి శ్రీ విశ్వ నాధుండు కనక పాదుకలు
మెట్టి చట్టలు పట్టుకొనుచు యేగు
దెంచిరి వయ్యార మెసగ మెసగ
విహరణక్రీడ మా యున్న వేదికపుడు

పాదభంగం,యతిభంగం కాకుండా రాసానని నమ్మకం తక్కువ.జ్ఞాపకం లోంచి రాసిన పద్యం.

ఈ పద్యం లో సొగసైన నడక,శబ్దసౌందర్యమే కాదు,ప్రతి పాదంలో మొదటి భాగం పార్వతీ దేవి వర్ణన కి సంబంధించినది,రెండవ భాగం పరమ శివుని వర్ణన కి సంబంధించినది.ఎత్తుగడ ఒకరకంగానే మొదలైనా,ఒకే అర్ధాన్నిచ్చే పదాలతో మొదలుబెట్టి వేరు వేరు వర్ణనలు చేయటం అర్ధనారీశ్వరులైన పార్వతీ పరమేశ్వరుల వర్ణనకి ఎంతో అందమైన,అర్ధవంతమైన,సముచితమైన ఔచితి ని సూచిస్తుంది. (శరీరాన్నే చెరిసగం పంచుకున్న పార్వతీ పరమేశ్వరులు పద్యపాదాలను మాత్రం చెరిసగం పంచుకోరా!!!)

ఈ పద్యం కి అర్ధం (నాకు చేతనైనట్లు)

చంద్ర బింబము వంటి ముఖము కలిగినది(పార్వతి),చంద్రవంకని శిరస్సున ధరించినవాడు(శివుడు)
వత్తైన నల్లని(నీలమైన)శిరోజాలు కలిగినది,నీలమైన(నల్లని) కంఠం కలవాడు
తెల్లని కన్నులు కలది, తెల్లని శరీరము కలవాడు ,
మన్మధుడిని బ్రతికించినది,మన్మధుడిని దహించినవాడు,
ఏనుగు (నాగేంద్రము)నడక వంటి అందమైన నడక కలిగినది, నాగకుండలాలను ఆభరణాలుగా ధరించిన వాడు
భువనమోహనమైన గాత్రము కలది,సర్వభువనాలకి కర్తయైన వాడు,
పర్వతరాజు ముద్దుల కూతురు,పర్వతములపైన నివసించేవాడు
అటువంటి గౌరీ దేవి శ్రీవిశ్వనాధులు చేయి చేయి కలిపి వయ్యరంగా వేంచేశారు.


ఎంత చక్కటి శిల్పం!పార్వతీ పరమేశ్వరులు "వయ్యార మెసగ మెసగ" వచ్చారని చెప్పటం ఎంత సముచితమైన వర్ణన !!సమస్త లోకాలకే కాదు నాట్యానికి,నృత్యానికి ఆదిదంపతులైన ఆ జంట నడకే వయ్యారాలొలికించే నాట్య విన్యాసమని చెప్పకనే చెప్పటం కాదా? మరి నటరాజు,ఆయన అర్ధాంగి గౌరిదేవి ప్రతి కదలికా నాట్యం కాక మరేమవుతుంది?! అసలు వారి కదలికలోనే Cosmic Rhythm ఉంది !!!

ఒక గొప్ప తన్మయత తో నిండిన భక్తిభావాన్ని సౌందర్య రసస్ఫోరకం గా సూచించటం లోనే ఆయన శిల్ప వైశిష్ట్యం తెలుస్తుంది

నాకైతే ఈ పద్యం విన్నప్పుడల్లా,విలాసంగా నాట్యం చేస్తున్న పార్వతీపరమేశ్వరుల చిత్రం చూస్తున్నట్లుంటుంది.
ఎవరైనా చక్కటి నృత్యకారిణులు ఇటువంటి పద్యాన్ని అభినయిస్తే బావుండుననిపిస్తుంది.

అయితే రెండవ పాదం లో "మదన సంజీవని మదన హరుడు " అని ఉంది. శివుడు మన్మధుడిని దహించటం జరిగాకే పార్వతి దేవి బ్రతికించటం జరిగినా ,ముందుగా మదన సంజీవని అనడం లో రెండు విధాలుగా ఔచితి ఉంది. మొదటగా ప్రతి పద్యపాదం లో ప్రధమార్ధం పార్వతి దేవికి సంబంధించినది కాబట్టి ఈ పద్య పాదం లో కూడా ప్రధమార్ధం ఆమెకి సంబంధించిన వర్ణన చేయటం .

రెండవది Precedence of Life over Death. మరణం పై జీవితం తాలూకు ఆధిక్యతను సూచించటం.ముఖ్యంగా అమరులైన దేవతల విషయం లో ఇది చాలా సందర్భోచితం.(ఈ విషయం మా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సాహిత్య చర్చలో ఒక సారి మా నాన్నగారు చెప్పినట్లు గుర్తు. )


గొప్ప శిల్పం,భావనా సౌందర్యం, ధార, భక్తిభావం ,రసమయంగా కలిసిపోయిన చక్కటి పద్యం.

అన్నట్లు,మహాశివరాత్రి శుభాకాంక్షలు !!!!

Monday, February 11, 2008

తొలి అడుగు

నమస్కారం!
బ్లాగ్ప్రపంచం లో ఇప్పుడే అడుగుపెడుతున్నాను.అందరికీ శుభాకాంక్షలు!!
వెన్నెల